Tuesday, May 10, 2011

Happy to see dada again...


నేను స్టేడియానికి వెళ్ళి క్రికెట్ చూడక దాదాపు ఏడాదిన్నరైంది. స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో మీడియా బాక్స్‌లోంచి చాలా మ్యాచ్‌‌లు ఎంజాయ్ చేశాను. కానీ.. జనరల్‌ డెస్క్‌లోకి వచ్చిన తర్వాత క్రికెట్ కోసం స్టేడియం వెళ్ళటం ఇష్టం లేక.. ఇంట్లోనే మ్యాచ్‌లను ఆస్వాదిస్తున్నా. ఇవాళ (5th May,2011) ఎందుకో స్టేడియానికి వెళ్ళి మ్యాచ్ చూడాలనిపించింది. చాలాకాలం తర్వాత మళ్ళీ నా అభిమాన ఆటగాడు బెంగాల్ టైగర్... సౌరవ్ గంగూలీ.. తోటి క్రీడాకారులు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే దాదా తిరిగి గ్రౌండ్లో బ్యాట్‌తో కనిపించనున్నాడు. ఇదే సంతోషంలో.. గ్రౌండ్‌కు వెళ్ళాలి, మ్యాచ్ చూడాలి అనుకున్నాను. కానీ ఇంత అర్జెంట్‌గా టికెట్లు ఎలా సంపాదించాలి... అదే టెన్షన్..


The Alchemist (పరుసవేది) novel లో చెప్పినట్లు.. మనకు మంచి జరగాల్సి ఉన్నప్పుడు ప్రపంచం మనకు అనుకూలంగా కుట్ర చేస్తుందన్నట్లు... నేను మనసులో అనుకున్నదే తడవుగా.. ఓ మిత్రుడికి ఫోన్ చేస్తే రెండు ఇవ్వను మూడిస్తాను.. అని 3 టికెట్స్ చేతిలో పెట్టాడు. థ్యాంక్యూ మిత్రమా... 


ఇవాళ దాదా ఆడతాడని ముందే తెలుసు. దీంతో.. గ్రౌండ్‌కు వెళ్ళినప్పటినుంచి అన్నీ వింతలే... డెక్కన్ ఛార్జర్స్ ఆడుతున్న మ్యాచులన్నీ empty standsతో కళకళ్ళాడాయి. కానీ ఇవాళ దాదా మ్యాచ్ కావటంతో.. హైదరాబాద్‌లోని గంగూలీ ఫ్యాన్స్ అంతా.. మ్యాచ్ చూసేందుకు తరలి వచ్చారు. (ఏప్రిల్ 24న ముంబైతో జరిగిన మ్యాచ్, మే 5న పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లకు మాత్రమే స్టాండ్స్ దాదాపు పూర్తిగా నిండిపోయాయి) మ్యాచ్‌కు ముందునుంచే.. హంగామా మొదలైంది. గంగూలీ ప్రాక్టీస్ చేస్తుంటే... ఫ్యాన్స్ ఛీరింగ్‌తో స్టేడియం హోరెత్తింది. టాస్ వేసి జట్టులో మార్పులను యువీ చెబుతుంటే.. గంగూలీ పేరు చదవగానే... మళ్ళీ అదే హోరు.. ప్లేయర్స్‌ ఇంట్రడ్యూస్ చేస్తూ... స్క్రీన్‌లో గంగూలీ ఫోటో రాగానే.. ఫ్యాన్స్ ఛీరింగ్‌తో స్టేడియం మార్మోగిపోయింది.


టాస్ ఓడిన వారియర్స్ ఫీల్డింగ్‌ చేయటంతో.. దాదా గ్రౌండ్లోకి వచ్చినప్పటినుంచి.... తిరిగి పెవిలియన్ వెళ్ళేంతవరకు ఫ్యాన్స్ దాదా జపం చేశారు. వన్‌డౌన్లో దాదా బ్యాటింగ్ వచ్చినపుడు కూడా అదే ఉత్సాహం. ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఫోర్, మిడ్‌వికెట్‌‌ మీదుగా సిక్సర్ కొట్టినపుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించిన దాదా.. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి వారియర్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్ చూడటం నిజంగా నా అదృష్టం. ఇక ఆడడనుకున్న దాదా తిరిగి బ్యాట్ చేతపట్టి రావటం చాలా సంతోషాన్నిచ్చింది. గంగూలీ ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్ చేసుంటే బాగుండేదని నా  పక్కన ఉన్న చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు. అది కూడా వాస్తవమే అనిపించింది. 


మ్యాచ్ మధ్యలో ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకువచ్చి.. దాదా కాళ్ళు పట్టుకున్న సీన్ మ్యాచ్ మొత్తానికే హైలైట్. అతని పేరు నితిన్ దోషి, హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వాసి, ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. గంగూలీ అంటే వీరాభిమానం. దాదా కాళ్ళ పట్టుకున్న నితిన్, ఒకసారి హగ్ చేసుకుంటానని అడగటంతో.. దాదా కాదన్నాడు. అతన్ని గ్రౌండ్లోంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు.. చితగ్గొట్టారు. పక్కనే ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతన్ని చితగ్గొట్టి బయటకు పంపించినపుడే డౌట్ వచ్చి.. మా ఉప్పల్ రిపోర్టర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి, అలర్ట్‌గా ఉండమని చెప్పాను. స్టేడియం నుంచి ఎవరినైనా పట్టుకొస్తే.. బైట్ తీసుకుని.. పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్... తీసుకొమ్మని చెప్పాను. అనుకున్నట్లుగానే నితిన్‌ను అక్కడికి తీసుకెళ్ళారు. మధ్యలోనే వెహికిల్‌లో కోటింగ్ అయినట్లుంది. మొహం వాడిపోయిందట.. శరీరంపై కొట్టిన దెబ్బలున్నాయి. మా రిపోర్టర్‌కు స్థానిక పోలీసులతో ఉన్న పరిచయంతో.. కాసేపు ఆ అభిమానితో మాట్లాడి బైట్ తీసుకున్నాడు. వెంటనే ఫోన్ చేశాడు. సంతోషం అనిపించింది. ఫీడ్ ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్ స్పెషల్.. ఎక్స్‌క్లూజివ్ స్టోరీ (ఈ రోజుకు రెండు సంతోషకరవిషయాలు చాలాకాలం తర్వాత దాదా గేమ్ చూడటం, ఎక్స్‌క్లూజివ్ స్టోరీ దొరకటం)


మ్యాచ్ పూర్తైన తర్వాత బయటకు రాగానే.. చాలా మంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు.. డీసీ చెత్త టీమ్.. దీని కోసం ఎవడొచ్చాడు. గంగూలీ కోసమే మ్యాచ్‌కు వచ్చాం purpose serve అయిందనుకుంటూ హ్యాప్పీగా వెళ్లారు. నాకూ అదే అనిపించింది.. లోకల్ ప్లేయర్స్‌ను వదులుకుని కోట్లు పెట్టి కొనుక్కున్న డెక్కన్ ఛార్జర్స్ పై ఎవరికి అభిమానం ఉంటుంది.. కేవలం డీసీ మేనేజ్‌మెంట్‌కు తప్ప. ఏదేమైనా దాదాను మళ్లీ గ్రౌండ్లో చూడటం.. అతని ట్రేడ్‌మార్క్ బ్యాటింగ్ చూడటం.. డీసీ ఓడిపోవటం అన్నీ శుభశకునాలే... జై‌హో దాదా...





Sunday, May 1, 2011

పాతబస్తీకి పాత కళ వచ్చేనా...?


పాతబస్తీ ఎప్పుడు పేలుతుందో తెలియని బాంబు. ఆధిపత్యపోరాటం, రాజకీయ అస్థిత్వంకోసం ఆరాటం, భూవివాదాలూ, వెరసి పాతబస్తీ రాజకీయం. ఏప్రిల్ 30వతేదీ MIM, MBT నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకు సుదీర్ఘమైన, సంక్లిష్టమైన నేపథ్యం ఉంది. ఒవైసీ కుటుంబానికి పాతబస్తీలో ఎంత ఆదరణ ఉందో.. అంతకన్నా ఎక్కువ విద్వేషమూ.. ఉంది. దశాబ్దాలుగా ఇది రగులుతూనే ఉంది. పాతబస్తీపై పట్టుబిగించి సర్వం తామే అన్నట్టు ఆధిక్యం ప్రదర్శిస్తున్న MIM నాయకుల ప్రాబల్యం ఉంది. ఒవైసీ కుటుంబంతో విభేదించి MIM నుంచి వైదొలిగిన అమానుల్లాఖాన్ 1994లో MBT నెలకొల్పారు. దీని నుంచే MIM ఎక్కువ ప్రతిఘటన ఎదురవుతోంది. పాతబస్తీ వెనుకబాటులో.. రాజకీయ పార్టీల ముసుగులో వర్థిల్లుతున్న నేరస్థ ముఠాల ప్రభావం ఉంది. MIMతో పొత్తు పెట్టుకొని పాతబస్తీలో ప్రభుత్వం యంత్రాగం పనిచేయలేని స్థితి (చట్టపాలన) కల్పించిన కాంగ్రెస్, టీడీపీల వైఫల్యమూ ఉంది. లాలూచీ ఉంది. కొన్నేళ్ళ కిందట సలావుద్దీన్ ఒవైసీ (MIM), ఆలె నరేంద్ర (అప్పుడు BJP) మధ్య ఆధిపత్యపోరు సాగినప్పుడు పాతబస్తీ ప్రజలు ఉంటే ఒవైసీ శిబిరంలో ఉండాలి... లేకపోతే ఆలె నరేంద్ర వైపుండాలి. ఇప్పుడు నరేంద్ర స్థానంలో MBT ఉంది. ఒవైసీతో పడనివారూ, MIMలో ఇమడలేనివారూ MBT గూటిలో చేరిపోతున్నారు. అన్ని పార్టీలలాగానే పాతబస్తీలో ప్రాబల్యం కలిగిన పార్టీలు కూడా భూకబ్జాదార్లకూ, అక్రమార్కులకూ, గూండాలకూ కొమ్ముకాస్తున్నాయి. ఇక్కడ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమవటంతో ఎవరి ప్రైవేటు సైన్యం వారికుంది. ఇంతకన్నా దారుణంగా ఉన్న బీహార్‌లో పరిస్థితి మారింది కానీ హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం మారలేదు. మార్చడానికి ప్రయత్నమూ జరగలేదు. CPM సాహసించి చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ఒవైసీ సోదరులు విద్యావంతులు. మంచి వాగ్ధాటి కలిగినవారు. తెలివితేటలు కలిగినవారు. సమయస్ఫూర్తి గలవారు. చట్టసభలలో ప్రతిభావంతమైన పాత్ర పోషిస్తున్నవారు. విదేశాలలో చదువుకున్న ఈ బ్రదర్స్. విదేశాలను సందర్శించి అక్కడి మత వ్యవస్థలనూ, పరిపాలనావ్యవస్థలనూ అధ్యయనం చేశారు. తమ అనుభవాన్నీ, పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించి పాతబస్తీలో ప్రజల జీవనాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి ప్రయత్నించి ఉండే చాలా బాగుండేది. ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పిన ఒవైసీ కుటుంబం అక్షరాస్యతను పెంపొందించడానికి ఉద్యమస్ఫూర్తితో కృషి చేసి ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించగలిగేవారు. పాతబస్తీ లిటరసీ రేటు అమాంతంగా పెరిగి.. ప్రజలు ఏది మంచో.. ఏది చెడో తెలుసుకోగలిగే స్థితిలో ఉండేవారు. ఆసుపత్రిని స్థాపించినట్టే ప్రజావైద్యం పట్ల శ్రద్ధ వహిస్తే బాగుండేది. పాతబస్తీలో సమూలమైన మార్పులు సాధించడానికి అవసరమైన వనరులు, ప్రాబల్యం, అధికారం, సామర్థ్యం, శక్తీ ఉండి కూడా పాతతరం రాజకీయ పద్ధతులనే అనుసరించడం హాస్యాస్పదం (తెలివిగా చేసిందే). నిజానికి నేటి పరిస్థితికి కారణం కూడా ఈ వైఖరే.
పాతబస్తీలో ఇలాంటి పరిస్థితిని మార్చడానికి పెద్ద ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. అదీ ఒవైసీ సోదరుల సాయంతోనే.. లేకపోతే ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ బ్రదర్స్ ఉదారంగా, ప్రజాస్వామికంగా, ప్రగతిశీలకంగా, అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయే విధంగా వ్యవహరించగలిగితే పాతబస్తీలో వాతావరణం కచ్చితంగా మారుతుంది. అనారోగ్యాన్నీ, నిరుద్యోగాన్నీ, నిరక్షరాస్యతను పారదోలడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. పాతబస్తీ కుటుంబాలలో వెలుగు నింపడానికి దోహదం చేస్తుంది. పాతబస్తీ ప్రజల బాగోగులతో నిమిత్తం లేనట్టు ప్రభుత్వం వ్యవహరించడం చేతకాని తనమని నిరూపించబడుతున్నా... ఇది క్షమించరాని నేరం. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పాతబస్తీలో జీవన  ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. పాతబస్తీ మినహా నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో జనాల్లాగా... ఇక్కడి వారు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తే చాలు. విద్యావకాశాలూ, ఉద్యోగవకాశాలూ, ఆదాయాలూ పెరిగితే క్రమంగా Criminal instinct తగ్గుతుంది. రాగద్వేషాలు, కోపతాపాలు, కక్ష్యలు-కార్పణ్యాలు సమసిపోతాయి. శాంతిసౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి. ఇది సాధ్యమైన మార్పే.

ప్రజల సమస్యలపై స్పందించే (తనకు అవసరం అనుకుంటేనే) తత్వమున్న అక్బరుద్దీన్, ఓ మంచి వక్తగా.. నాయకుడిగా పాతబస్తీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. అలాంటి అక్బర్ కోలుకుంటేనే MIM పార్టీకి కొండంత అండ. దూకుడైన ఉపన్యాసాలతో రెచ్చగొట్టే అసదుద్దీన్ తమ్ముడిపై దాడి ఘటన తర్వాతైనా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇకనైనా ఇలాంటి వివాదాలను పక్కనపెట్టి ఇద్దరు సోదరులు ప్రజాశ్రేయస్సుపై దృష్టిసారిస్తే ఘనమైన చరిత్ర ఉన్న పాతబస్తీ మళ్లీ పాతవెలుగులు సంతరించుకుంటుంది.
జైహింద్
(కొందరు మేధావులు మాట్లాడుతుండగా విని... నా అనుభవాలను జోడించి రాశాను... ఏమైనా మార్పులు అవసరమైతే suggest చేయగలరు)

Tuesday, February 22, 2011

VEERA NARI JHANSI AKKA AMAR RAHE


ఫిబ్రవరి 19, 2011 ప్రపంచకప్, ఇండియా-బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమ్యాచ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. బ్లాగ్ క్రియేట్ చేసుకున్నానే తప్ప.. అప్‌డేట్ చేయటం లేదనే బాధతో.. నాకిష్టమైన క్రికెట్ స్టోరీలతో రంగంలోకి దిగుదామనే ఆలోచనతో.. ప్లాన్ చేసుకుంటున్నా... కాళ్లూ చేతులూ ఆడటం లేదు.. టీ తాగుతూ.. నోట్స్ రాసుకుంటున్నాను..  అంతలోనే.. బ్రేకింగ్ న్యూస్.. మహబూబ్‌నగర్‌లో రోడ్డుప్రమాదం, బీజేపీ నాయకురాలు వనం ఝాన్సీకి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం..
చేతులోంచి ప్యాడ్, పెన్ను కిందపడిపోయింది.. వెంటనే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రన్నకు ఫోన్ చేశా.. అన్నా ఏంటి పరిస్థితి.. అనగానే.. బాధగా.. నీలేష్ SHE IS NO MORE అన్నారు. అంతే మరో ఆలోచన లేకుండానే కళ్ళ నుంచి నీళ్ళొచ్చాయి. వంటింట్లోంచి వచ్చిన మా ఆవిడకు అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. వెంటనే పార్టీ ఆఫీసుకు బయలుదేరాను.. బండి నడుపుతుంది నేనే కానీ.. నా ఆలోచనలు మాత్రం.. ఝాన్సక్క చుట్టే. పార్టీ ఆఫీసులో విషాదఛాయలు.. అక్క ఫోటో వెతికి.. ఫ్లెక్సీ బ్యానర్లు చేయించే పనిలో ఉన్నారు. అక్కణ్ణించి ఉస్మానియా ఆసుపత్రికెళ్లాను. బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలంతా.. అక్కడే ఉన్నారు. ఎవరూ దిగ్భ్రాంతినుంచి కోలుకోలేదు. డీఆర్‌డీఎల్ అపోలో హాస్పిటల్‌లో కిషన్ రెడ్డి భోరున ఏడ్చేశారు. (రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఎంపికైన తర్వాత.. ఝాన్సక్క వీరనారిలా దూసుకుపోయింది) పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుపోయే గొప్పమనస్తత్వమున్న ఝాన్సక్క... మహిళా సమస్యలు, పేదప్రజల సంక్షేమం, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. రాజకీయాల్లోనే ఫైర్‌బ్రాండ్‌గా ఉండే ఝాన్సక్క  ఆఫ్ ద పాలిటిక్స్‌ సీన్‌లో అంతే డిసిప్లిన్డ్‌గా ఉండేది. పెద్దోళ్ళను అన్నా అని.. చిన్నోళ్ళని తమ్ముడూ.. అని ఎంతో ఆప్యాయంగా పిలిచేది.


అలాంటి ఝాన్సక్క వచ్చే రాఖీపౌర్ణమి రోజు రాఖీ కట్టలేదని గుర్తుచేసుకుంటే చచ్చేంత బాధకలుగుతోంది. ఝాన్సక్క గురించి బీజేపీ బద్ధశత్రువులైన హార్డ్‌కోర్ కమ్యూనిస్టు నాయకులు కొందరు పార్టీ ఆఫీసుకు రావటం ఈమె గొప్పతనానికి నిదర్శనం.


ఝాన్సక్క గురించి ఇంకా రాయాలని ఉన్నా... చేయికదలటం లేదు.. క్షమించాలి...
ఝాన్సక్క అమర్‌రహే..

Tuesday, November 9, 2010

In the name of communism...

whats going in india. terrorists from pakistan is not at all a threat to Indians. but in the name of communism some eminent personalities creating disturbances in Indians.

very soooooon we will come to u
who are the real heroes of the nation
and who are the villans

if u have any suggestions dont hesitate to post ur coments
thanku
An Indian